1979 విప్లవం తర్వాత రెండో సుప్రీం లీడర్ – ఇరాన్‌ను చక్రవర్తిలా ఆడించిన అయతొల్లా ఖమేనీ ఎవరు?
1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం ఆ దేశాన్ని రాజరిక పాలన నుండి మతాధికార పాలన వైపు మలిచింది. షా పహలవీ పరిపాలన కూలిపోయిన అనంతరం, అయతొల్లా రుహుల్లా ఖోమేనీ తొలి సుప్రీం లీడర్‌గా, ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన మతపరమైన వ్యక్తిగా ఎదిగారు.
ఆయన మరణానంతరం, 1989 జూన్ 4న అయతొల్లా అలీ ఖమేనీ రెండవ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఖమేనీ అప్పటికి శియా మతపరంగా అత్యున్నత హోదా కలిగిన “మర్జా-ఎ-తక్లీద్” స్థాయిలో లేకపోయినా, రాజకీయ చతురతతో మరియు మతపరమైన సంఘాల మద్దతుతో ఈ పదవికి ఎన్నికయ్యారు.
ఖమేనీ అధికార వ్యాప్తి:
అతని నాయకత్వం మతపరమైనదే కాదు – మిలటరీ, న్యాయవ్యవస్థ, మీడియా, ఇంటెలిజెన్స్, అంతర్గత వ్యవహారాలు అన్నింటిపై నియంత్రణ ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ పదవి జీవితకాలం ఉండే పదవి. ఆయన పదవీకాలం ఇప్పటికి 35 సంవత్సరాలు దాటింది, ఇది ప్రపంచ రాజకీయాల్లో అతి దీర్ఘకాలం ఉండే నేతలలో ఒకరిగా నిలుస్తోంది.
ఇతర ముఖ్యాంశాలు:
- శియా ఇస్లాం మతానికి చెందిన ఖమేనీ, మతపరమైన తీర్పులే కాకుండా, రాజకీయ, ఆర్థిక విధానాల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
- ఇటీవల జరిగిన ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వైమానిక ఘర్షణల సందర్భంలో ఖమేనీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు, ఆయనకు ఇప్పటికీ ఎంతటి కట్టుదిట్టమైన నియంత్రణ ఉందో స్పష్టం చేస్తాయి.
- ఇరాన్‌లోని సైనిక, క్షిపణి నిర్మాణ సంస్థలపై ఇటీవల జరిగిన దాడులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “ఇజ్రాయెల్ తన చర్యలకు కఠినమైన మూల్యం చెల్లించాల్సి వస్తుంది” అన్న మాటలు అంతర్జాతీయ దృష్టిని ఆయనవైపు మళ్లించాయి.
తెర వెనుక రాజకీయ ప్రయోగాలు:
ఇరాన్ రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను మార్చి ఖమేనీకి ఈ పదవిని ఇవ్వడం, అప్పుడు దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంగా చెప్పబడుతుంది. ఆయన నియమానికి కొంతమంది శియా మతపండితులు అప్పట్లో వ్యతిరేకత వ్యక్తం చేసినా, అధికార వ్యవస్థ అతని వెంటే నిలిచింది.
